ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి | UP Shabnam first woman to be hanged after Independence | Sakshi
Sakshi News home page

ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి

Published Wed, Feb 17 2021 8:29 PM | Last Updated on Wed, Feb 17 2021 8:53 PM

UP Shabnam first woman to be hanged after Independence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు ఉత్తరప్రదేశ్‌ జైలు అధికారులు సిద్ధమయ్యారు.  ఏడుగురు కుటుంబ  సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన ఓ మహిళను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథుర కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో తలారి పవన్‌ జల్లద్‌ ఉరితాడును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు వివరాల ప్రకారం.. మథురకు చెందిన షబ్నమ్‌ అనే మహిళ స్థానికంగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే సలీం‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడి అనంతరం శారీరక సంబంధానికి దారతీసింది. పెళ్లికి ముందే షబ్నమ్‌ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు.

మరోసారి అతనితో తిరగొద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్‌ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కొరకు కుటుంబ సభ్యుల అనుమతినికోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్‌ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్‌ ప్రియుడు సలీంతో కలిసి హతమర్చాలని పథకం పన్నింది. అనుకున్నదే తడువుగా 2008 ఏప్రిల్‌ 14న అర్థరాత్రి సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్‌ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్‌, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.

దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్‌ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో  ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement