పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్‌లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది.
మీడియాతో.. సోనాలి సోదరి రమణ్
‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్‌గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్‌లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు.
నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్‌పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్‌మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్‌మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు.
2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్‌హౌజ్‌లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు.
హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.
ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం
Comments
Please login to add a commentAdd a comment