కాంగ్రెస్ ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’లో పాల్గొన్న నేతలు (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న సోనియా
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాయకులకు కాంగ్రెస్ ఎంతో చేసిందని, అలాంటి వారంతా రుణం తీర్చుకొనే సమయం అసన్నమైందని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులంతా అవసరమైతే త్యాగాలు చేసి, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో ఆమె స్వాగతోపన్యాసం చేవారు.
నాయకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తీకరించడం చాలా అవసరమని అన్నారు. అయితే సంస్థ బలం, దృఢ సంకల్పం, ఐక్యతలకు సంబంధించి కేవలం ఒక సందేశం మాత్రమే బయటకు వెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం పార్టీ ముందు ఉన్న అసాధారణ పరిస్థితులను అసాధారణ మార్గాల్లో మాత్రమే పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌లో సంస్కరణల అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు. పార్టీని సంస్కరించక తప్పదని ఉద్ఘాటించారు. వ్యూహాత్మక మార్పు, నిర్మాణాత్మక సంస్కరణలు, రోజువారీ పని చేసే విధానంలో మార్పు వంటివి ఇప్పుడు అవసరమైన అత్యంత ప్రాథమిక అంశాలు అని తెలిపారు. సమష్టి కృషితోనే పార్టీ అభ్యున్నతి సాధ్యమవుతుందని, ఇకపై ఈ ప్రయత్నాలను వాయిదా వేయలేమని సోనియాగాంధీ స్పష్టం చేశారు.
ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం..
గత కొంతకాలంగా ఎదురవుతున్న వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటోందని, అలాగే పార్టీ ఎదుర్కోవాల్సిన పోరాటాలు, సవాళ్లు తమకు గుర్తున్నాయని సోనియా తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తమకు పూర్తిగా తెలుసని అన్నారు.
దేశ రాజకీయాల్లో గతంలో పోషించిన కీలక పాత్రలోకి కాంగ్రెస్‌ను తీసుకొచ్చేందుకు, పార్టీని దేశ ప్రజలు ఆశిస్తున్న పాత్రలోకి మార్చేందుకు అవసరమైన ప్రతిజ్ఞ చేయడానికి నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చింతన్ శిబిర్‌లో ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని వివరించారు. ఇక్కడి నుంచి బయలుదేరే సమయానికి ప్రతి ఒక్కరూ నూతన విశ్వాసం, నిబద్ధతతో స్ఫూర్తిని పొందేలా సిద్ధం కావాలని కోరారు.
రాజకీయ ప్రత్యర్థులే బీజేపీ టార్గెట్
బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలో భయం, అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని సోనియా గాంధీ ఆరోపించారు. మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మతం పేరుతో ఏకీకరణ జరుగుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు.
దేశం కోసం జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని, త్యాగాన్ని క్రమపద్ధతిలో తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహాత్మా గాంధీని పొట్టనపెట్టుకున్న హంతకుడిని కీర్తిస్తూ గాంధీ సిద్ధాంతాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో సాంప్రదాయ విలువలు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడుతోందని సోనియా గాంధీ వాపోయారు.
ఇల్లు చక్కదిద్దుకున్నాకే పొత్తులపై చర్చ: ఖర్గే
‘‘మేం ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాల్సి ఉంది. పొత్తులు తదితరాలపై ఆ తర్వాతే దృష్టి సారిస్తాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుంటే చేతులు కలిపేందుకు ఎవరు ముందుకొస్తారు? అందుకే పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకుని బలోపేతం కావడంపైనే ముందుగా దృష్టి పెడతాం. మా నాయకులు మరింత చురుగ్గా, శక్తిమంతులుగా తయారవాలి’’ అన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ చింతన్ శిబిర్‌లో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment