న్యూఢిల్లీ: తెలుగు దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షపడిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ శిక్షాకాలం తగ్గింపునకు సంబంధించి మొత్తం ఒరిజినల్ రికార్డులు సమర్పించాలని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆనంద్ మోహన్ నేర చరిత్ర వివరాలు సైతం అందజేయాలని సూచించింది. ఈ కేసులో విచారణకు ఇక వాయిదా వేయలేమని, రికార్డులన్నీ సమర్పించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం బిహార్ సర్కారు తరపు న్యాయవాది మనీశ్ కుమార్‌కు తేల్చిచెప్పింది.
శిక్షాకాలం ముగియక ముందే ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జి.కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ ప్రతిస్పందనను తెలియజేసేందుకు కొంత గడువు ఇవ్వాలన్న మనీశ్ కుమార్ విజ్ఞప్తిని తిరస్కరించింది. నిబంధనల్లో సవరణలు చేసి మరీ ఆనంద్ మోహన్ శిక్షాకాలాన్ని తగ్గించి అతన్ని విడుదల చేస్తూ నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment