Supreme Court On Marital Rape: However Brutal The Husband Is... Supreme Court's Key Remarks On Marital Rape - Sakshi
Sakshi News home page

మగాడు ఎంత క్రూరుడైనా సరే: సుప్రీంకోర్టు

Published Tue, Mar 2 2021 12:38 PM | Last Updated on Tue, Mar 2 2021 1:46 PM

Supreme Court Asks However Brutal Husband Is Called Molestation - Sakshi

న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పురుషుడు ఎంత క్రూరుడైనా, ఎన్ని తప్పులు చేసినా దానిని లైంగిక దాడికి అన్వయిస్తారా అని ప్రశ్నించింది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే పెళ్లి పేరిట తప్పుడు వాగ్దానాలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం నాటి కేసు విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివరాలు.. వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి గతంలో ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రెండేళ్ల అనంతరం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. 

ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరిట తనను మోసగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దిగువ కోర్టులో తనకు న్యాయం జరగడం లేదని భావించిన వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరస్పర అంగీకారంతోనే తాము ఒక్కటయ్యామని, ఇందులో తన తప్పేమీ లేదని, కాబట్టి బెయిలు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేయగా, సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లి చేసుకుంటానని అసత్యపు ప్రమాణాలు చేయడం తప్పు. పురుషులైనా, మహిళలు అయినా ఎవరూ ఇలాంటి పనిచేయకూడదు.

ఒకవేళ ఓ స్త్రీ, పురుషుడు భార్యాభర్తల్లాగా కలిసి జీవిస్తున్నారంటే(నిబద్ధత లేకపోయినా).. ఆ పురుషుడు ఎంత క్రూరుడైనా సరే, ఎన్ని పొరపాట్లు చేసినా సరే వారి మధ్య శృంగారాన్ని అత్యాచారం అంటారా’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరూ కలిసి ఉన్న సమయంలో ఇష్టప్రకారమే శృంగారంలో పాల్గొన్నారు. నిజానికి పెళ్లి కూడా చేసుకోలేదు. అది కేవలం ఓ బంధం మాత్రమే’’ అని వాదించారు. ఇందుకు బాధితురాలి తరఫు న్యాయవాది ​ స్పందిస్తూ.. ‘‘పెళ్లి పేరుతోనే బాధితురాలిపై అత్యాచారం చేశాడు. మనాలిలోని ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అ‍త్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇందుకు సంబంధించి మెడికల్‌ రిపోర్టులు కూడా ఉ‍న్నాయి’’ అని న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు బదులుగా వినయ్‌ న్యాయవాది.. బాధితురాలికి మరో ఇద్దరు వ్యక్తులతో సంబంధం ఉందంటూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా  మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ‘‘మీరు ఇలా మాట్లాడకూడదు. ఆమె బాధితురాలు’’ అని స్పష్టం చేసింది. అనేక వాదోపవాదాల అనంతరం ఎట్టకేలకు నిందితుడికి అరెస్టు నుంచి ఎనిమిది వారాల పాటు రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్‌ బెయిలుకు అప్లై చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.

చదవండిఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

 పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?‌: సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement