నల్లకోటు ధరిస్తే.. ఇతరుల కన్నా ఎక్కువేం కాదు | Supreme Court Dismisses Plea Seeking Covid Compensation for Lawyers kin | Sakshi
Sakshi News home page

నల్లకోటు ధరిస్తే.. ఇతరుల కన్నా ఎక్కువేం కాదు

Published Wed, Sep 15 2021 3:32 AM | Last Updated on Wed, Sep 15 2021 8:39 AM

Supreme Court Dismisses Plea Seeking Covid Compensation for Lawyers kin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒక న్యాయవాది జీవితం ఇతరుల జీవితం కన్నా విలువైనది ఏమీ కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నల్లకోటు ధరించి ఉన్నందుకు, మీ జీవితం ఇతరుల జీవితం కన్నా ఎక్కువనుకుంటున్నారా? న్యాయవాదులు దాఖలు చేసే ఇలాంటి బోగస్‌ వ్యాజ్యాలు ఆపాల్సిన సమయం వచ్చింది’ అని స్పష్టం చేసింది. 60 ఏళ్లలోపు న్యాయవాదులు కరోనాతో మృతి చెందినట్లైతే వారి కుటుంబసభ్యులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ న్యాయవాది ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు విచారించింది. న్యాయవాది కాబట్టి ప్రచారం కోసం పిల్‌ దాఖలు  చేశారని ధర్మాసనం పేర్కొంది.

తాను ప్రభుత్వం నుంచి సొమ్ములు డిమాండు చేయడం లేదని, కేసులు దాఖలు చేసేటప్పుడు న్యాయవాదులు కడుతున్న కోర్టు ఫీజుల నుంచి కోరుతున్నానని, ఆ సొమ్ము అంతా ఎక్కడికి పోతోందని ప్రదీప్‌కుమార్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బార్‌ సభ్యులకు పరిహారం కోరడానికి కోర్టుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, పిల్‌లో గ్రౌండ్స్‌ అన్నీ అసంబద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

న్యాయవాదులు ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి పరిహారం ఇవ్వాలని న్యాయమూర్తులను డిమాండు చేయడం పునరావృతం కారాదు అంటూ పిల్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌కు రూ.10వేల జరిమానా విధించింది.  60 ఏళ్లలోపు న్యాయవాదులు కరోనాతో మృతి చెందినట్లైతే వారి కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల బార్‌కౌన్సిళ్లు తదితరులను ప్రతివాదులుగా చేరుస్తూ ప్రదీప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement