
సాక్షి, న్యూఢిల్లీ: ఆచరణ సాధ్యం కానీ, అమలు చేయడం వీలుకానీ ఆదేశాలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టులకు సూచించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో... సుమోటోగా స్వీకరించింది అలహబాద్ హైకోర్టు. విచారణ పూర్తైన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది.
నెల రోజుల వ్యవధిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ప్రతీ గ్రామానికి ఐసీయూ సౌకర్యం కలిగిన రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో అన్ని నర్సింగ్ హోమ్‌లలో ఉన్న బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలంది. నిష్పత్తికి తగ్గట్టుగా ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలంది.
సుప్రీంలో అప్పీల్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్లింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం వాస్తవంలో సాధ్యం కాదని పేర్కొంది. నెల నుంచి నాలుగు నెలల సమయం ఇచ్చి ఇన్ని అద్భుతాలు చేయమంటే మా వల్ల కాదంటూ వాదించింది. కోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల ఉత్తర ప్రదేశ్‌లో ఆరోగ్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతింటోందని వివరించింది.
అలా వద్దు
ఉత్తర ప్రదేశ్ వాదనలు విన్న తర్వాత... ఆచరణలో సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దంటూ అలహబాద్ హైకోర్టుకు సూచించింది సుప్రీం కోర్టు. కరోనాతో విలవిలాడుతున్న ప్రజల కష్టాలను చూసి కోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పట్టలేమంది. అయితే కోర్టు వెలువరించే ఆదేశాలు ఆచరణలో సాధ్యమయ్యేవిగా ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment