ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి రైతులను విలన్‌లుగా చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను వారు కాల్చడానికి చాలా కారణాలు ఉండొచ్చు.. కానీ దానిని అరికట్టడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. ప్రతియేటా శీతాకాలం ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పంట వ్యర‍్థాలపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఇలా స్పందించింది.
'రైతులను విలన్‌లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం వంటి అనేక కారణాలు వారికి ఉండొచ్చు. పంటవ్యర్థాలు కాల్చడాన్ని అరికట్టాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వమే ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా..? పంజాబ్‌లో మొత్తంలో కేవలం 20 శాతం కేసుల్లో మాత్రమే జరిమానా విధించారు. జరిమానాతో పాటు ఎఫ్‌ఐఆర్ వంటి చర్యలను తీసుకోవచ్చు. వరి పెంపకం వల్ల పంజాబ్ నేలల్లో తేమశాతం తగ్గిపోతుంది.' అని సుప్రీంకోర్టు మండిపడింది.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. గతంతో పోలిస్తే ఈ నవంబరులో దిల్లీ మరింత కాలుష్య నగరంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల కాల్చివేతల ఘటనలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ, యూపీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment