ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
సమస్య పరిష్కారం నా ఒక్కడి చేతుల్లో లేదు
ఆల్ పార్టీ నేతలు చేసేది రాజకీయ విమర్శలే
ప్రధాని దృష్టికి స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్
రూ.73 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు.. ముఖ్య నగరాల మీదుగా అమరావతికి బుల్లెట్ రైలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం నా ఒక్కడి చేతిలో లేదు. ఏం చేద్దామన్న విషయంపై మాకు సరైన స్పష్టత లేదు. ఈ అంశం విషయంలో ఆల్ పార్టీ నేతలతో మీటింగ్ పెడితే వాళ్లేం చెబుతారు? వాళ్లు రాజకీయ విమర్శలే కదా చేసేది? శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా. అందుకే దీనిపై వైట్ పేపర్ (శ్వేతపత్రం) రిలీజ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
ఉదయం రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి.. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియా బృందంతో సమావేశం నిర్వహించి, ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చాలా జఠిల సమస్య అని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీని కలిసి ‘స్వర్ణాంధ్ర–2047’ డాక్యుమెంట్‌ను వివరించానని, పోలవరం నిధుల విషయంలో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు.
విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన
విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా రూ.73,743 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్–అమరావతి–చెన్నై–బెంగుళూరు–హైదరాబాద్ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ తీసుకు రావాలని కోరానని తెలిపారు. 2026లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అమరావతి–విజయవాడ రైల్వే లైన్, మచిలీపట్నం–రేపల్లె కనెక్టివిటీ, ఇక్కడ నుంచి కాకినాడకు కనెక్టివిటీ ఉండేలా పనులు ప్రారంభించాలని కోరామన్నారు.
రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని.. నడికూడి, శ్రీకాళహస్తి, కోటపల్లి, నర్సాపూర్ వంటి లైన్‌లను కూడా మార్చాలని కోరానని తెలిపారు. హైదరాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ వేపై నితిన్ గడ్కరీతో చర్చించానని చెప్పారు. 189 కి.మీల అమరావతి ఓఆర్‌ఆర్‌పై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment