కొరుక్కుపేట(చెన్నై): తిరుచెందూరు రైల్వేస్టేషన్‌లో టికెట్లు ఇచ్చేందుకు కౌంటర్‌లో సిబ్బంది లేకపోవడంతో 300 మంది టిక్కెట్ లేకుండానే తిరునెల్వేలికి ప్రయాణించారు. రైల్వే స్టేషన్లలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సిబ్బంది పనిచేస్తుండడంతో టిక్కెట్లు దొరకడం చాలా కష్టమని ప్రయాణికులు వాపోతున్నారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ నుండి తిరునెల్వేలికి రోజూ ఉదయం 7.20, 8.25, 10.15, 12.20, మధ్యాహ్నం 2.30, 4.35, సాయంత్రం 6.15, రాత్రి 8.10 గంటలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
పనుల నిమిత్తం తిరునెల్వేలికి వెళ్లే వారు ఉదయం 7.20, 8.25 గంటలకు ఈ రైలులో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే నజరేత్, శ్రీవైకుంఠం, కరడంగనల్లూర్, పాలై యంగోటై వంటి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉండడంతో ఈ రెండు రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. సోమవారం ఉదయం 7.20 గంటలకు నెలైకి వెళ్లే రైలు ఎక్కేందుకు తిరుచెందూర్ రైల్వే స్టేషన్‌కు వందల మంది ప్రజలు క్యూ కట్టారు. కానీ టికెట్ ఇవ్వడానికి కౌంటర్ వద్ద ఉదయం 7.15 వరకు ఉద్యోగి ఎవరూ రాలేదు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు సిద్ధమయ్యారు.
అప్పుడు తమిళం తెలియని స్టేషన్ మాస్టర్ టిక్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే తనకు తమిళం రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సుమారు 300 మంది ప్రయాణికులు తిరుచిరాపల్లి సెంథూర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కి అందరూ వెళ్లిపోయారు. తిరుచెందూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం డ్యూటీలో ఉండాల్సిన వ్యక్తి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సెలవు తీసుకోవడమే ఈ సమస్యకు కారణంగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment