సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు కుదించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు శుక్రవారం తెలిసింది. ఖజానాపై రూ.7 వేల కోట్ల అదనపు భారం పడుతుందనే ప్రభుత్వం వెనక్కుతగ్గినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వ పరిధిలో 9 లక్ష ల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 27 వేల (3 శాతం) మంది ప్రతి ఏటా ఉద్యోగ విరమణ చేస్తున్నారు. వారికి హోదాకు తగినట్టు బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి వెంటనే తగిన సొమ్ము చెల్లించలేకపోయింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 59 ఏళ్లకు పెంచింది. ఈ ఏడాది కూడా కరోనా దుస్థితి కొనసాగడంతో ఆర్థిక ప్రగతి ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో ఉద్యోగ విరమణ వయసును 59 నుంచి 60కి పెంచుతూ గత సీఎం ఎడపాడి పళనిస్వామి ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్మెంట్ వయసును రెండుసార్లు పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్లు మిగులుతో తాత్కాలికంగా ఊరట లభించింది. ప్రభుత్వం మారి డీఎంకే అధికారంలోకి రావడంతో ఉద్యోగ విరమణ వయసును 58కి కుదిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ అంశంపై ప్రభుత్వం సైతం సమాలోచనలు జరిపింది. ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2020–21లో ఉద్యోగ విరమణ వయసును పెంచకుంటే రూ.5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, 2021–22లో రూ.7 వేల కోట్ల భారం తప్పదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసే వారికి బాండు రూపేణా సొమ్ము చెల్లించాలని ప్రభుత్వం భావించినా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ల పరిమితి యధాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించినట్టు సమాచారం. దీంతో కొన్నినెలలుగా ఊగిసలాటలో ఉన్న ఉద్యోగులకు ఊరట లభించినట్టు అయింది.
చదవండి: ఈనెల 23 వరకు పొడిగింపు: సీఎం
Comments
Please login to add a commentAdd a comment