సాక్షి, చెన్నై: ఒమిక్రాన్‌గా రూపుమార్చుకుని విదేశాల్లో ప్రబలుతున్న వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు తెలిపారు. ఒమిక్రాన్ సోకితే ప్రజల ప్రాణాలకు పెనుముప్పు తప్పదని.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎస్ ఇరైయన్బు సోమవారం చెన్నై సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ దేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపడుతోందని తెలిపారు.
ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఓ లేఖ రాసిందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మాస్కు, భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాఫ్రికా, ఐరోపా, బంగ్లాదేశ్, బోడ్స్‌వానా, మార్షియస్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయల్ తదితర 12 దేశాల నుంచి వచ్చేవారు తమకు వైరస్ లక్షణాలు లేకున్నా ఆంక్షలు పాటించాలన్నారు.
చదవండి: (Omicron Variant: ఒమిక్రాన్ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్‌డౌన్: ఆరోగ్యమంత్రి)
ఒమిక్రాన్ పరీక్షలకు 12 కేంద్రాలు
ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచ్చిరాపల్లి జిల్లాల్లో ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. చెన్నైలోని స్టాన్లీ, కీల్‌పాక్ ప్రభుత్వ వైద్య కళాశాలల, చెన్నై గిండీలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. టేక్‌బాత్ అనే కిట్ ద్వారా ఫలితాలను ప్రకటిస్తున్నామని వెల్లడించారు. తొలి దశ పరీక్షలో డీఎన్‌ఏ టెస్ట్ చేసి ఫలితాలు వెల్లడించేందుకు ఏడు రోజులు పడుతుందన్నారు. ఒమిక్రాన్ వైరస్ శరీరంలోని రోగనిరోధకశక్తిని దెబ్బతీసి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇప్పటి వరకు తమిళనాడులో ప్రవేశించలేదని తెలిపారు. ఒమిక్రాన్‌ను ఆర్‌టీపీసీఆర్ ద్వారా గుర్తించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment