సాక్షి, చెన్నై : కరోనాకు తోడు ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 46 మంది చికిత్సలో ఉండగా శుక్రవారం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 74కు చేరింది. దీంతో ఆంక్షలను కఠినతరం చేయడానికి సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఓవైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసుల కలవరం రెట్టింపు అవుతోంది. ప్రధానంగా చెన్నైలో రోజుకు సరాసరిగా వందకు పైగా అదనపు కేసులు నమోదు అవుతున్నాయి.
సైదాపేటలోని ఓ శిక్షణా కేంద్రంలో 34 మంది శుక్రవారం కరోనా బారినపడ్డారు. దీంతో ఆంక్షలను కఠినతరం చేయాల్సిన అవశ్యం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో వైద్య అధికారులు, వైద్య నిపుణులు, సీనియర్ మంత్రులతో సచివాలయంలో శుక్రవారం ఉదయం సీఎం స్టాలిన్ సమావేశం అయ్యారు. కరోనా అన్‌లాక్ ఆంక్షలు శుక్రవారంతో ముగియడంతో జనవరి 10 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు.
చదవండి: (కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం)
తమిళనాడులో సంక్రాంతి పండుగ అత్యంత కీలకం కావడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే 1–8 తరగతుల వరకు ఆన్‌లైన్ విద్యను కొనసాగించేందుకు నిర్ణయించారు. అలాగే హోటళ్లు, సంస్థలు, కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, సినిమా థియేటర్లు, మెట్రో రైళ్లలో 50 శాతం మందికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివాహ కార్యక్రమాల్లో 100 మందికి, అంత్యక్రియల్లో 50 మందికి అనుమతి ఇచ్చారు. ఆలయాలకు వచ్చే భక్తులకు అత్యవసర చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఎంకే స్టాలిన్ ఈ అత్యవసర చికిత్స కేంద్రాలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment