ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే నేను మీకు బెయిల్ ఇస్తా’ అని తన అనుచరులకు సూచించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో షిండే వర్గం ఎమ్మెల్యే ప్రకాష్ సర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉద్ధవ్ థాక్రే వర్గం.
ఆగస్టు 14వ తేదీన ముంబైలోని కొకాని పడా బుద్ధ విహార్ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే. ‘ఎవరైనా మీతో ఏదైనా అంటే వారికి సమాధానం ఇవ్వండి. ఎవరి దాదాగిరిని ఉపేక్షించేది లేదు. వారిని తరిమికొట్టండి. నేను ప్రకాష్ సర్వే, మీకోసమే ఇక్కడ ఉన్నాను. మీరు వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కనీసం వారి కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే మీకు నేను బెయిల్ ఇస్తాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మేము ఎవరితో గొడవ పెట్టుకోము. కానీ, మాతో ఎవరైనా గొడవకు దిగితే ఊరుకోము.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే.
ఎమ్మెల్యే ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది ఉద్ధవ్ థాక్రే వర్గం. దహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్రమంలో విపక్షాలు దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులతో మాట్లాడనున్నారు.
ఇదీ చదవండి: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు దర్జాగా భార్యాకొడుకులతో ఇంట్లో!! ఫొటో దుమారం
Comments
Please login to add a commentAdd a comment