న్యూఢిల్లీ: ‘‘టెలిఫోన్ వైర్ల గుండా ఏకంగా 11 కేవీ కరెంటు ప్రవహించిందా? అయినా అవి వెంటనే కరిగిపోలేదా? పైగా ఆ కరెంటు వాటిగుండా ఓ టీవీలోకి ప్రవహించి ఒకరి మరణానికి కారణమైందా? అంత హై వోల్టేజీ విద్యుత్ ప్రవహించినా టీవీ పేలిపోవడం, ఇంట్లో వైరింగంతా కాలిపోవడం జరగలేదా? అవే టెలిఫోన్ తీగలను పట్టుకున్న నిందితునికీ ఏమీ కాలేదా? ఇదంతా వినడానికే చాలా అసంబద్ధంగా లేదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2003 నవంబర్లో కర్ణాటకలో ఒక వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తూ కరెంటు షాక్‌కు గురై చనిపోయిన కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. టీవీలో హఠాత్తుగా శబ్దం పెరిగిపోవడంతో దగ్గరికెళ్లి రెండు వైర్లను విడదీసే ప్రయత్నంలో షాక్ కొట్టి సదరు వ్యక్తి మరణించాడు.
ఇందుకు కారకులంటూ ఇద్దరిపై కేసు నమోదైంది. వారు కరెంట్ పోల్‌పై టెలిఫోన్ వైర్లు లాగుతుండగా వాటి గుండా 11 కేవీ విద్యుత్ మృతుని ఇంట్లోని టీవీలోకి ప్రవహించడం మరణానికి కారణమైందంటూ ట్రయల్ కోర్టు వారికి 15 నెలల కారాగార శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించడంతో వారు సుప్రీంకోర్టులో అపీలు చేసుకున్నారు. ‘‘మరణానికి నిందితుల నిర్లక్ష్యమే కారణమనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలేవీ లేవు. అసలంతటి షాక్ కొడితే మృతుని శరీరం తీవ్రంగా కాలిపోవాల్సింది. అలా జరగలేదు. తీగలను ముట్టుకున్న ఒక సాక్షికి అసలేమీ కాలేదంటున్నారు. అదెలా సాధ్యం? ఈ కేసులో ఆరోపణలన్నీ సాంకేతికమైనవి. వాటిపై కనీసం సాంకేతిక నిపుణుడితో మదింపు చేయించలేదు. వీటన్నింటి దృష్ట్యా నిందితులను సంశయ లాభం కింద విడుదల చేయాల్సింది. కానీ కేవలం ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పును కొట్టేసింది.
11KV Current In Telephone Wire: నమ్మశక్యంగా లేదు... టెలిఫోన్ వైర్లలో 11 కేవీ కరెంటా?
Published Wed, May 18 2022 12:53 AM | Last Updated on Wed, May 18 2022 8:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment