న్యూఢిల్లీ: థియేటర్ లెజెండ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ ఇబ్రహీం అల్కాజీ(94) కన్నుమూశారు. నాటక రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇబ్రహీం కుమారుడు ఫైజల్ అల్కాజీ ధ్రువీకరించారు. ‘‘తీవ్రమైన గుండెపోటు రావడంతో నాన్నను సోమవారం ఎస్కార్ట్ ఆస్పత్రిలో చేర్పించాం. మంగళవారం ఆయన మరణించారు’’అని పేర్కొన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు ఇబ్రహీంకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కాగా ఇబ్రహీం మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత థియేటర్ రంగానికి విశిష్ట సేవలు అందించి, ఎన్నో తరాలకు స్పూర్తిగా నిలిచిన ఇబ్రహీం లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత అయిన ఈ లెజెండ్ వారసత్వాన్ని ఆయన శిష్యులు, కుటుంబ సభ్యులు కొనసాగించాలని ఆకాంక్షించారు.
అత్యున్నత పురస్కారాల గ్రహీత
‘ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ థియేటర్’గా ప్రసిద్ధికెక్కిన ఇబ్రహీం అల్కాజీ.. తుగ్లక్(గిరీశ్ కర్నాడ్), అషధ్ కా ఏక్ దిన్(మోహన్ రాకేశ్), అంధా యుగ్(ధర్మవీర్ భారతీ) వంటి ప్రముఖ నాటకాలకు తన దర్శకత్వ ప్రతిభతో ప్రాణం పోశారు. 1962 నుంచి 1977 వరకు ఎన్‌ఎస్‌డీ డైరెక్టర్‌గా కొనసాగిన ఆయన ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చి గొప్ప నటులుగా తీర్చిదిద్దారు. నసీరుద్దీన్ షా, ఓంపురి వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయన వద్దే పాఠాలు నేర్చుకున్నారు. ఇబ్రహీం ఇద్దరు పిల్లలు కూడా థియేటర్ ఆర్టిస్టులుగా రాణిస్తూ ఆయన నటనా వారసత్వాన్ని నిలబెడుతున్నారు. కళా రంగానికి అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వ ఆయనను పద్మశ్రీ(1966), పద్మభూషణ్(1991), పద్మ విభూషణ్(2010) పురస్కారాలతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment