
సమరేష్ దాస్
కోల్‌కతా : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు.. పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరినీ పట్టి పీడిస్తోంది. కోవిడ్ ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి పశ్చిమబెంగాల్‌లో మరో ఎమ్మెల్యే మృతి చెందారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(74) సోమవారం కరోనాతో మరణించారు.
(చదవండి : దేశంలో 26 లక్షలు దాటిన కరోనా కేసులు)
ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ దాస్ కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా విపత్తుల సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందించారు. ఈ క్రమంలో ఆయనకు జూలై 18న కరోనా సోకింది. సాల్ట్ లేక్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి చెందారు. ఎమ్మెల్యే సమరేష్ దాస్ మృతి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. కాగా, రాష్ట్రంలో ప్రతిరోజూ 3 వేలకు పైగా కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 1.15 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
(చదవండి : తెలంగాణలో 894 పాజిటివ్, 10 మంది మృతి)