
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక వంతెన కూలిపోయింది. శ్రీనగర్‌లోని అనేక రహదారులు జలమయమ్యాయి. వరదల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శ్రీనగర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-పూంచ్ హైవేను మూసివేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో రాజోరి, రియాసి, రాంబన్, జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 64 నుంచి 115 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
శ్రీనగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గందర్‌బల్ జిల్లాలోని హస్నాబాద్ కంగన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జమ్మూలోని విక్రమ్ చౌక్, ఓల్డ్ సిటీ, భగవతి నగర్, కెనాల్ రోడ్, తలాబ్ టిల్లో, జానీపూర్, రిహారి తదితర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. కథువా, రియాసీలో తేలికపాటి వర్షం కురిసింది.