న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి చేరవేసే కార్యక్రమం సోమవారం మూడో రోజుకు చేరుకుంది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 249తో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో మరో విమానం సోమవారం ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయుల చేరవేత ప్రక్రియ శనివారం ప్రారంభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 6 ఎయిర్ ఇండియా విమానాల్లో 1,396 మందిని వెనక్కి తీసుకొచ్చింది. ప్రైవేట్ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా తమ విమానాలను బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు పంపించాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి మరికొన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.
పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసినట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలియజేసింది. సాధ్యమైనంత త్వరగా రైళ్ల ద్వారా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత విద్యార్థులకు సూచించింది. విదేశీయులు, శరణార్థుల కోసం ఉక్రెయిన్ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. రైల్వే స్టేషన్లు రద్దీగా మారే అవకాశం ఉందని, అయినప్పటికీ విద్యార్థులు సహనం వహించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రైళ్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వంటివి జరగొచ్చని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. పాస్‌పోర్టు, తగినంత నగదు, ఆహారం, వేడినిచ్చే దుస్తులు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment