
హిసువా (బిహార్): బిహార్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని మహా ఘట్‌బంధన్ సంకీర్ణాన్ని ‘బ్యాడ్’ (భ్రష్టాచార్–అవినీతి, అరాచకం, దమన్–అణచివేతలకు పాల్పడుతున్న) సర్కారుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అనైతిక సంకీర్ణాన్ని బీజేపీ ఓడించి తీరుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆదివారం బిహార్‌లోని నవడా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిహార్‌లో మత హింసకు నితీశే కారకుడంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకం ప్రబలుతుంటే చూస్తూ ఊరుకోబోనన్నారు. ‘‘పరిస్థితిపై నేను గవర్నర్‌తో మాట్లాడటాన్ని జేడీ(యూ) చీఫ్ లాలన్‌సింగ్ తప్పుబడుతున్నారు. నేను కేంద్ర హోం మంత్రినని ఆయన మర్చిపోవద్దు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గాక ఈ అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం’’ అని హెచ్చరించారు.
77 మంది అదుపులో
బిహార్లో పలుచోట్ల మత ఘర్షణలు కొనసాగుతున్నట్టు సమాచారం. రామనవమి ఉత్సవాల సందర్భంగా నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 77 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. శనివారం రాత్రి మరోసారి ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లోనే ఉన్నట్టు చెప్పారు. ససారాంలో శనివారం 45 మందిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment