మహారాష్ట్ర అడవుల్లో 40 రోజులు నిరాహారంగా
రక్షించిన మహారాష్ట్ర పోలీసులు
40 రోజులుగా ఆహారం లేక చిక్కిశల్యమైన శరీరం
తమిళనాడులో ఉంటున్న యూఎస్ మహిళగా గుర్తింపు
ఆస్పత్రికి తరలింపు
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అడవుల్లో ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ మహిళ కనిపించింది. రోజులుగా ఆహారంలేక ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. పశువుల కాపరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ దగ్గర దొరికిన యూఎస్ పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కాయి కుమార్ ఎస్‌గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్‌లో సోనుర్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అక్కడ అతనికి మనిషి మూలుగు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఓ మహిళ కాలికి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సావంత్‌వాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.
మహిళ దగ్గర యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు అడ్రస్‌తో ఆధార్ ఉందని, పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటోందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను.. ఇంట్లో గొడవల కారణంగా భర్తే.. 40 రోజుల కిందట అడవిలో వదిలేసి వెళ్లినట్లుగా ఆస్పత్రిలో ఆమె రాసిన వివరాల ఆధారంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె వీసా గడువు కూడా ముగిసిందని, విదేశీయుల స్థానిక నమోదు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు ఆమె భర్త, బంధువుల గురించి వించారించేందుకు కొన్ని బృందాలు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment