
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ధౌలిగంగా నది భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా.. 204 మంది గల్లంతయ్యారు. ఎన్‌టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ తపోవన్ సొరంగంలో ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ప్రమాదం తర్వాత హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు, సరస్సుకు సంబంధించిన మరింత సమాచారం కోసం విశ్లేషణ జరపడంతోపాటు వరద ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
దుర్ఘటన జరిగిన రైనీ గ్రామానికి సమీపంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు వెల్లడించారు. మరో ఆందోళనకర అంశం ఏంటంటే సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే మరో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచు కరుగుతున్న కొద్ది నీటిమట్టం పెరుగుతోంది. ఫలితంగా సరస్సు ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇదే జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. వీటి నుంచి బయటపడేందుకు ప్రణాళిక రచిస్తున్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్ నిపుణులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, ‘‘రైనీ గ్రామానికి సమీపంలో ఏర్పడిన సరస్సు గురించి మాకు తెలిసింది. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనిపై పని చేస్తోన్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎయిర్ డ్రాఫ్ట్ నిపుణులను పంపి పరిస్థితిని సమీక్షిస్తాం’’ అన్నారు. ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలో సరస్సు ఏర్పడిందని తెలిసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సంయుక్త దళాలను అక్కడకు పంపాము’’ అన్నారు.
చదవండి: ఉత్తరాఖండ్ జలవిలయం: ఓ కుక్క కథ!
జల విలయం నేర్పుతున్న గుణపాఠం
Comments
Please login to add a commentAdd a comment