సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.
కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు.
ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment