పాట్నా: ఈయన పెళ్లాన్ని ఆయన.. ఆయన పెళ్లాన్ని ఈయన పెళ్లాడారు.. విధి ఆడిన వింత నాటకంలో ఒకరి భార్య మరొకరికి అర్థాంగి అయ్యింది. అర్థం చేసుకోవడానికి గందరగోళంగా ఉన్నా.. బిహార్‌లో జరిగిన వాస్తవం ఇది. ఖగారియా జిల్లాలో ఒకరి భార్యను మరొకరు పెళ్లాడారు. హార్డియా గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ సింగ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం.
నలుగురు పిల్లల తల్లైన నీరజ్ భార్య రూబీ దేవికి పెళ్లికి ముందు నుంచే తన గ్రామానికి చెందిన ముకేష్ అనే వ్యక్తితో పరిచయముంది. ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించింది. అయితే ముకేష్‌కు గతంలో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళల పేర్లు రూబీనే కావడం విశేషం. గతేడాది ఫిబ్రవరి 6న నీరజ్ భార్య రూబీ దేవి తన ముగ్గురు పిల్లల్ని(ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) తీసుకొని.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడు ముకేష్‌ను పెళ్లి చేసుకుంది.
ఇటు నీరజ్ తన కుమార్తెతో మిగిలిపోగా.. ముఖేష్ భార్య రూబీ దేవి కూడా తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉండిపోయింది. ముకేష్‌తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్‌కు తెలియడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముకేష్ అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన నీరజ్ పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ముకేష్ మొదటి భార్య ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
ఇలా ఇద్దరూ నిత్యం ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఫిబ్రవరి 11న ఇంట్లో నుంచి పారపోయి. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు జంటలు మధ్యప్రదేశ్‌లోని వేర్వేరుపట్టణాల్లో నివసిస్తున్నారు. నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేష్ రోజుకూలీగా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment