
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యలో 357కు చేరింది. మరో 200 మంది బాధితులు కనిపించడం లేదు. మరోవైపు.. వయనాడ్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. బాధితుల వదిలేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.
వివరాల ప్రకారం.. వయనాడ్ ప్రాంతంలో బాధితులు కొంత మంది తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారి ఇళ్లలో సామాగ్రి, కొన్ని విలువైన వస్తువులు అక్కడే ఉండిపోయాయి. ఈ క్రమంలో వారి నివాసాలను దొంగలు టార్గెట్ చేశారు. రాత్రి సమయంలో దొంగలు అక్కడికి చేరుకుని వారి నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, తాజాగా కొందరు బాధితులు వారి ఇళ్లకు వెళ్లి చూడగా సామాగ్రి లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని బాధిత ప్రజలు అధికారులను కోరారు.
BREAKING NEWS
Wayanad landslide survivors say abandoned homes are being looted. pic.twitter.com/3jR9p3bJCk— Bharat Spectrum (@BharatSpectrum) August 3, 2024
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన సమయంలో మా భద్రత కోసం మేము మా ఇళ్లను విడిచిపెట్టాము. కానీ ఆ తర్వాత మా ఇంటికి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసేందుకు ఇక్కడికి వచ్చాం. మేము తిరిగి వచ్చినప్పుడు, తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని చూసి ఆందోళనకు గురయ్యాం. మా ఇళ్లలోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువులను కూడా దొంగతనం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఉంటున్న రిసార్టులోకి గదిని కూడా దొంగలు టార్గెట్ చేశారు. మా దుస్తులను, డబ్బులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, బాధితుల ఫిర్యాదుతో చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా రాత్రి వేళల్లో విపత్తు ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ప్రవేశించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, మరేదైనా ప్రభావిత ప్రాంతాల్లోకి లేదా ఇళ్లలోకి ప్రవేశించడానికి ఎవరినీ అనుమతించరు అని పోలీసు శాఖ పేర్కొంది.