ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణకై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగడం పట్ల అతడి ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె.. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్ట విరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పూర్తిగా చట్టవిరుద్ధం. న్యాయ సూత్రాలకు అతీతం. దేశ సమాఖ్య స్పూర్తిపై ప్రభావం చూపుతుంది’’అని పేర్కొన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.(జూన్ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా)
ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం సుశాంత్‌తో సహ జీవనం చేసిన రియా చక్రవర్తే అతడిని ఆత్మహత్యకు పురిగొల్పిందని, డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఇందులో భాగంగా సుశాంత్ సొంత రాష్ట్రమైన బిహార్( ప్రభుత్వం) ఈ కేసులో సీబీఐ విచారణ కోరడంతో కేంద్రం ఇందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన సీబీఐ.. సుశాంత్ కేసులో రియాతో పాటు మరో ఐదుగురి(ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ) పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. ఇక ఈ విషయంపై స్పందించిన రియా.. బిహార్ పోలీసుల నుంచి ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడక ముందే సీబీఐ విచారణ మొదలుపెట్టడం సరికాదని పేర్కొన్నారు. (రియా పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ)
పిటిషన్‌లో రియా ఏం చెప్పిందంటే..
తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న నేపథ్యంలో బిహార్ పోలీసుల నుంచి కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని కోరిన సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన రియా.. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని కోర్టు తెలిపారు. జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. డిప్రెషన్‌తో బాధ పడుతున్న సుశాంత్.. దానిని అధిగమించేందుకు మందులు వాడేవాడని.. ఈ క్రమంలో జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు.
నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్.. సీబీఐ దర్యాప్తు కావాలి
ఇక రియా గతంలో ‘సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరిన విషయం తెలిసిందే. ‘‘నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను’’అని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం ఓవైపు తన ఆస్తులపై ఈడీ ఆరా తీయడం, మరో వైపు సీబీఐ విచారణ వేగవంతం చేయడంతో ఆమె స్వరం మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment