
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది.
ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు.
అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment