
పెళ్లైన పురుషుడు ఓ అమ్మాయిని వివాహేతర సంబంధంలోకి ఆహ్వానిస్తున్నాడంటే.. వెంటనే జాగ్రత్తపడాలి. అతడు నిజమే చెబుతున్నాడా లేదా అన్న విషయాన్ని గ్రహించాలి. అతడితో జీవితం పంచుకోవడం సరైందో లేదో ఆలోచించాలి.
భోపాల్: దేశంలో నమోదవుతున్న అత్యాచార కేసులకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ మహిళా కమిషన్ చీఫ్ కిరణ్మయి నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సహజీవనం చేసిన తర్వాత ఇరువురి మధ్య బంధం బెడిసికొట్టినపుడే మహిళలు ఫిర్యాదు చేస్తారని వ్యాఖ్యానించారు. సినిమాలు చూసి చెడిపోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఒక్క తప్పుడు నిర్ణయం కారణంగా జీవితం నాశనమైపోతుందని, ప్రలోభాలకు లొంగితే కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చకై బిలాస్‌పూర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్మయి నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘పెళ్లైన పురుషుడు ఓ అమ్మాయిని వివాహేతర సంబంధంలోకి ఆహ్వానిస్తున్నాడంటే.. వెంటనే జాగ్రత్తపడాలి. అతడు నిజమే చెబుతున్నాడా లేదా అన్న విషయాన్ని గ్రహించాలి. అతడితో జీవితం పంచుకోవడం సరైందో లేదో ఆలోచించాలి. అలా జరగని పక్షంలో ఆ బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా మహిళలే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తారు. చాలా కేసుల్లో అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తితో లైంగిక సంబంధం కొనసాగిస్తూ, సహజీవనం చేస్తూ ఉంటారు. విడిపోయిన తర్వాత మాత్రం రేప్ కేసులు పెడతారు’’ అని ఆమె పేర్కొన్నారు.(చదవండి: మహిళపై యూట్యూబర్ అఘాయిత్యం)
అదే విధంగా.. ‘‘కమిషన్ విధుల్లో భాగంగా మాకు సాధ్యమైనంత మేర భార్యాభర్తల తగాదాలు తీర్చడానికి ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో మహిళలు, పురుషులను తిడతాం. వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. కౌన్సిలింగ్ అంటే ఇలాగే ఉంటుంది మరి’’ అని కిరణ్మయి చెప్పుకొచ్చారు. ఇక చాలా మంది టీనేజ్‌లోనే పెళ్లి చేసుకుని చిక్కులు తెచ్చుకుంటున్నారన్న ఆమె.. ‘‘మైనర్లు.. సినిమాల్లో చూపించే రొమాన్స్ ట్రాప్‌లో పడొద్దు. ఇటీవలి కాలంలో 18 ఏళ్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకోవడం ఎక్కువైపోయింది. అయితే కొన్నేళ్ల తర్వాత వారి జీవితంలోకి పిల్లలు వస్తారు కదా.. అప్పుడే సమస్యలు మొదలవుతాయి. వారిని పోషిస్తూ బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతుంది. దయచేసి ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు’’అని విజ్ఞప్తి చేశారు.
Chhattisgarh Women''s Commission president KiranmayiNayak - mostly girls file FIR for rape after separation! @GargiRawat @RajputAditi @ShonakshiC @AunindyoC @PoliceWaliPblic @ndtv @ndtvindia pic.twitter.com/YQiX6rTm9y
— Anurag Dwary (@Anurag_Dwary) December 12, 2020