
నిరుద్యోగానికి ఆడాళ్లే కారణమట!
ఉద్యోగాలు చేసే మహిళలు పెరిగినందువల్లే దేశంలో నిరుద్యోగం శాతం పెరిగిపోతోంది. ఈ మాటలు సాక్షాత్తు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సెకండరీ స్కూలు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల్లోనివి. రాష్రానికి చెందిన పదో తరగతి ప్రభుత్వ పాఠ్యపుస్తకంలోని ఒక పాఠంలో 'ఉద్యోగాలు చేస్తున్నమహిళల వల్లే నిరుద్యోగం పెరుగుతోంది.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిరుద్యోగ శాతం పెరిగింది. అన్ని రంగాల ఉద్యోగాల్లోనూ మహిళలు పనిచేయడమే దీనికి కారణం' అని పేర్కొన్నారు. విద్యార్థుల మెదళ్లపై ప్రభావం చూపే ఈ అనుచిత పాఠ్యాంశంపై జాష్పూర్కు చెందిన ఓ టీచర్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో దుమారం రేగింది.
ఈ ఉదంతాన్ని మహిళా కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు విద్యార్థులకు ఇలాంటి విషయాలను బోధించడంపై మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు.
పాఠ్యపుస్తకాల్లో ఇలాంటి తప్పులు దొర్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సెకండరీ పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్య్ర సమరయోధులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. అలాగే 2013లో మహారాష్ట్రకు చెందిన పాఠ్యపుస్తకాల్లో అరుణాచల్ ప్రదేశ్ను దేశపటం నుంచి తొలగించేశారు. 2012లో మరో రాష్ట్రంలోని సీబీఎస్సీ సిలబస్లో మాంసాహారం తినేవారు అబద్ధాలు ఆడతారని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత ఆయా పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకున్నారు.