Year Ender 2024: విద్యారంగంలో నూతన అధ్యాయం | Year Ender 2024: Major Changes by Government of India in Education Sector | Sakshi
Sakshi News home page

Year Ender 2024: విద్యారంగంలో నూతన అధ్యాయం

Published Mon, Dec 30 2024 7:57 AM | Last Updated on Mon, Dec 30 2024 9:52 AM

Year Ender 2024: Major Changes by Government of India in Education Sector

2024లో దేశంలోని విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలో జరిగిన వివిధ పరీక్షల పేపర్ లీక్ కేసులు ప్రభుత్వాన్ని పలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇదిలావుంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టింది. 2024లో విద్యా రంగంలో చోటుచేసుకున్న నూతన మార్పులను ఒకసారి గుర్తుచేసుకుందాం.

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్
దేశంలో విద్య, పరిశోధనలకు నూతన దిశను అందించడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్(One Nation One Subscription) పథకాన్ని ప్రారంభించింది. ఇది విద్యార్థులు, పరిశోధకులకు జాతీయ స్థాయిలో అకడమిక్ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధన డేటాబేస్‌లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు ఇది డిజిటల్ విప్లవంగా మారింది.

పీఎం విద్యా లక్ష్మి యోజన
2024లో కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ముఖ్యంగా దేశంలోని 860 ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కనీస వడ్డీ రేట్ల(Minimum interest rates)కు విద్యా రుణాలు లభిస్తాయి. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి ప్రభుత్వం వచ్చే ఏడేళ్లలో రూ.3,600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

పీఎంశ్రీ
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020 కింద పీఎం శ్రీ విద్యాలయాలను నెలకొల్పారు. వీటిని సమగ్ర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించారు. విద్యార్థులను అకడమిక్ పరిజ్ఞానం వైపు మాత్రమే కాకుండా సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు ప్రేరేపించడం దిశగా ఈ విద్యా విధానం ముందుకుసాగనుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ పథకం
కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్(PM Internship) పథకాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించింది. దీనిలో విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం పొందగలుగుతారు. విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువతకు ఈ పథకం ఒక వేదికను అందిస్తుంది. విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా వివిధ రంగాలలో పనిచేసిన అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు.

ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement