
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేటి అయోధ్య పర్యటన రద్దైంది. రామ మందిర ‘భూమి పూజ’ ఏర్పాట్లను ఆదివారం సీఎం యోగి పరిశీలించాల్సి ఉంది. కానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆమె మరణంతో సీఎం యోగి అయోద్య పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న జరిగే అయోద్య రామ మందిర ‘భూమి పూజ’ వేడుక సన్నాహాక కార్యక్రమాల సమీక్షలో భాగంగా సీఎం యోగి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రామ జన్మభూమిని సందర్శించాల్సి ఉంది. (భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్‌లో ఆహ్వానం)
అదే విధంగా హనుమన్‌గారి ఆలయం, రామ్ కి పాడి కూడా సందర్శించాల్సి ఉంది. సీఎం యోగి పర్యటనలో మార్పు చోటు చేసుకోవటంతో హనుమాన్‌గారి ఆలయం వద్ద నిషన్‌పూజను రద్దు చేశామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆదివారం జరగాల్సిన నిషన్‌పూజను మంగళవారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరాముని సంబంధించిన ఎదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు హనుమంతుని నిషన్‌పూజ తప్పకుండా జరపాలనే ఆచారం కొనసాగుతోందని తెలిపారు. ఆగస్టు5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే.
ఇక జులై18న కమలా రాణి అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment