వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి
హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి ∙విభజన హామీలనూ నెరవేర్చాలి
విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి.. పోలవరం త్వరగా పూర్తి చేయాలి
విశాఖ స్టీల్ ప్లాంట్, గనుల ప్రైవేటీకరణ ఆపాలి
టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు
రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలి
రాజ్యసభలో వైఎస్‌స్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మరోసారి పార్లమెంటులో గళమెత్తింది. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. విభజన హామీలతోపాటు కేంద్రం అమలు చేయాల్సిన పెండింగ్ పనులు, రాష్ట్రంలో అధికారపార్టీ దాడులు, యూజీసీ, నీట్ తదితర అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల సమ్మతి, సంప్రదింçపులు లేకుండా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళయిందని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని ఇదే సభలో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థించినా, నిరసనలు తెలిపినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది డిమాండ్ కాదని, అన్యాయంగా జరిగిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రజల కల నెరవేరుతుందని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రులను పదుల సార్లు కలిసి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాను అడగాలని చెప్పారు. విభజన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ఇవ్వాలని, దీని కోసం గత ప్రభుత్వం భూమిని కూడా గుర్తించిందని తెలిపారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్, వైజాగ్ – చెన్నై కారిడార్, వైజాగ్ పోర్టు–భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రహదారిని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు మెట్రోను మంజూరు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్, గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.
రైతులకు చేయూతనివ్వండి
పీఎం కిసాన్ నిధి కింద రైతులకు రూ.3.20 లక్షల కోట్లు అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచడంపట్ల సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ పథకం ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచాలన్నారు. ఏపీలో రైతు భరోసా పథకం కింద 49 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకానికి మొత్తం రూ.6,534 కోట్లు కేటాయించిందన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
పరీక్షల విధానాన్ని సంస్కరించండి
దేశంలో పరీక్షల విధానాన్ని సంస్కరించాలని విజ్ఞప్తి చేశారు. నీట్, యూజీసీ పరీక్షల్లో 23 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, అందులో ఏపీ నుంచి 70 వేల మంది ఉన్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ కళాశాలల్లో 55,645 సీట్లు, ఎయిమ్స్‌లో 2000 సీట్లే ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం కళాశాలలు, సీట్లు పెరగలేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను లక్షకు పెంచాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ దాడులు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అధికార పార్టీ హింసాత్మక దాడులకు పాల్పడుతోందని సుబ్బారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం జేసీబీలతో కూల్చివేస్తోందని తెలిపారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని కూల్చివేశారని, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల కూల్చివేతకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
నాలుగు తెలుగు చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారని, ఇది పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. మీడియా సంస్థలపై ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment