కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిస రని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జికా ఏంటి? లక్షణాలు, ప్రమాదాలేమిటి తెలుసుకుందామా?
మెదడు, నాడీ మండలంపై ఎఫెక్ట్
జికా వైరస్ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది.
ఉగాండాలో మొదలై..
1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. దోమల ద్వా రా వ్యాపిస్తుందని గుర్తించారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్‌గా పేరుపెట్టారు. 1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకింది. మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. తర్వాత వైరస్ మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వచ్చాయి. 2015–16లో జికా మహమ్మారి గా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ప్రతాపం చూపింది.
–సాక్షి సెంట్రల్‌డెస్క్
ఎలా వ్యాపిస్తుంది?
►డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి.
►లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు.
►ఈ వైరస్ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి.
►వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
►జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
గర్భస్థ శిశువులకు ప్రమాదం
గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భం లోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
‘జికా’పై కేంద్రం అప్రమత్తం
కేరళకు ఆరుగురు నిపుణుల బృందం
న్యూఢిల్లీ: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. కేంద్ర బృందంలో సీనియర్ వైద్యులతోపాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారని.. కేరళలో పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment