నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్‌ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది.
టెట్ నిబంధన సరికాదు
డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి
ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే..
Comments
Please login to add a commentAdd a comment