● 2021–22 నుంచి పెండింగ్‌లోనే దరఖాస్తులు ● ఏళ్లుగా సాయం
నిర్మల్‌చైన్‌గేట్:కుల రహిత సమాజాన్ని నిర్మించి అంతరాలను చెరిపి వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు కొన్నేళ్లుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, జంటలో ఒకరు ఎస్సీ అయి ఉండాలనేది నిబంధన. ప్రస్తుత సమాజంలో పలువురు తల్లిదండ్రులు కులాంతర వివాహాలకు అడ్డుచెప్పడం లేదు. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకున్నా పోలీసులను ఆశ్రయించి ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్న కులాంతర వివాహం చేసుకున్న వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం ఏళ్లుగా పెండింగ్ ఉంది.
రూ.2.50 లక్షలకు పెంపు...
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఇస్తు న్న ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.50 వేలు ఉండగా 2019లో దానిని రూ.2.50 లక్షలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమాజంలో కులాంతర వివాహలపై అవగాహన పెరిగింది. పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు తమతో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
అవసరమైన ధ్రువపత్రాలు..
వేర్వేరు కులాలకు చెందిన సీ్త్ర, పురుషులు వివాహం చేసుకుంటే.. పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల విచారణలో అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కుల ధ్రువపత్రాలు, వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీలు, మార్కుల మెమో, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పెండింగ్‌లో 37 దరఖాస్తులు..
ఈ పథకం కింద ప్రభుత్వాలు ఎస్సీలకు రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. 2011 వరకు రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. 2012లో రూ.50 వేలకు పెంచారు. ప్రస్తుతం రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కులాంతర వివాహం చేసుకున్న దంపతుల సంయుక్త ఖాతాలో మూడేళ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అవుతుంది. జిల్లాలో 2019 నుంచి 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15 లక్షలను విడుదల చేయగా ఆరుగురు దరఖాస్తుదారులకు అందించారు. ఇంకా 37 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
‘కల్యాణలక్ష్మి’ వైపు మొగ్గు..
జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అనేక కులాలు ఉన్నప్పటికీ.. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు చాలా మంది పెద్దలను ఒప్పించి.. కులాంతర వివాహం చేసుకుంటున్నారు. సకాలంలో ప్రోత్సాహకం అందించకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు(పెద్దలు ఒప్పుకున్న వారు) కల్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపుతున్నారు.
దరఖాస్తుల వివరాలు
ఐదేళ్లలో వచ్చిన దరఖాస్తులు 93
హార్డ్ కాపీ అందజేసిన వారు 82
ఇప్పటివరకు లబ్ధి పొందినవారు 56
పొందిన నగదు రూ.140 కోట్లు
ఇంకా లబ్ధిపొందని వారు 37
జమ చేయాల్సిన నగదు రూ.92 లక్షలు
పెండింగ్‌లో ఉన్న సహాయం వివరాలు:
ఏడాది దరఖాస్తులు నగదు
2021–22 5 రూ.12.50 లక్షలు
2022–23 7 రూ.17.50 లక్షలు
2023–24 7 రూ.17.50 లక్షలు
2024–25 18 రూ.45 లక్షలు
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరిస్తున్నాం. వీటిని పరిశీలించి సాయం మంజూరుపై సమాచారం కూడా చేరవేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పెండింగ్‌లో ఉన్నజంటల ఖాతాల్లో జమ చేస్తాం.
– రాజేశ్వర్‌గౌడ్, ఎస్సీ సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment