● పసిడి పంటకు దక్కని ‘మద్దతు’ ● బోర్డు వచ్చినా అందని ఫల
లక్ష్మణచాందలో సాగు చేసిన పసుపు పంట
లక్ష్మణచాంద: ఆరుగాలం కష్టపడి పసుపు సాగు చేసిన జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన అన్నదాతలకు దిగుబడి బాగా తగ్గింది. వచ్చిన కాస్త పంట అమ్ముకుందామనుకుంటే ప్రస్తుతం మార్కెట్‌లో ధర లేదు. పొరుగు జిల్లా నిజామాబాద్‌లో ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాకు చెందిన పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు గిట్టుబాటు ధర వస్తుందని భావించారు. కానీ.. పసుపు బోర్డు ఏర్పాటైనా అక్కడ కూడా పంటకు సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఈసారి సుమారు 5,500 ఎకరాల్లో పసుపు సాగు చేసినట్లు జిల్లా ఉద్యానవన అధికారి బీవీ రమణ తెలిపారు. గతేడాది 15వేల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది సాగు ప్రారంభ దశలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. తరువాత క్రమంలో పంటకు వివిధ తెగుళ్లు సోకాయి. ప్రధానంగా దుంప కుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకగా పంట దెబ్బతిని దిగుబడి ఘననీయంగా తగ్గింది. ఎకరాకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ధీర్ఘకాలిక (9 నెలలు) పంట అయిన పసుపు సాగు కు పెట్టుబడి కూడా ఎక్కువేనని రైతులు చెబుతున్నారు. ఎకరం సాగుకు కనీసం రెండు లారీల పశువుల ఎరువు అవసరముంటుందని తెలిపారు. ఇందుకు రూ.60వేలు, కలుపు తీతకు కూలీలు, రసాయన ఎరువులకు కలిపి రూ.25 వేలు, పసుపు తవ్వకం, ఉడకబెట్టడం కోసం మరో రూ.30 వేలు.. ఇలా మొత్తంగా ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. గతేడాది పలికిన ధరే ఈసారి ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.
పడిపోతున్న ధర
గతేడాది క్వింటాల్ పసుపు పంటకు రూ.16వేల నుంచి రూ.17వేల వరకు ధర ఉంది. ఇది రైతులు ఆశించిన ధరే కావడంతో అప్పుడు గిట్టుబాటైంది. ప్రస్తుతం నిజామాబాద్‌లో క్వింటాల్ పసుపు పంటకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు మాత్రమే ధర ఉంది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో సాగు వివరాలుగతేడాది సాగు : 15వేల ఎకరాలు
ఈ ఏడాది.. : 5,500 ఎకరాలు
ఎకరాకు పెట్టుబడి : రూ.లక్ష–రూ.లక్షన్నర
గతేడాది ధర : రూ.16వేలు–రూ.17వేలు
ప్రస్తుత ధర : రూ.7వేలు–రూ.10వేలు
Comments
Please login to add a commentAdd a comment