ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాలి
భైంసారూరల్: నిబంధనల మేరకే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, కొలతల్లో తేడాలుంటే ఉపేక్షించబోమని డీఆర్డీవో విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పనులపై 15వ బహిరంగ విచారణ చేపట్టారు. మండలంలోని 30 గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన పనులపై చర్చించారు. సామాజిక తనిఖీ బృందాలతో చేయించిన పనులు వివరాలు తెలుసుకున్నారు. కూలీలతో కలిసి సామాజిక తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇంటింటికీ వెళ్లి కూలీలను కలిసి వివరాలు సేకరించారు. గ్రామాల వారీగా సేకరించిన వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభ నిర్వహించి వెల్లడించారు. గ్రామపంచాయతీల్లో నాటిన మొక్కలు చనిపోవడం, పని ప్రదేశాల్లో నేమ్‌బోర్డులు పెట్టకపోవడం, మస్టర్లలో కూలీల సంతకాలు లేకున్నా వేతనాలు చెల్లించడం లాంటి అంశాలను ప్రజావేదికలో డీఆర్పీలు వెల్లడించారు. 2023–24 సంవత్సరంలో రూ.7.50కోట్లతో చేపట్టిన పనుల్లో కొన్ని లోపాలను గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విధులను నిర్లక్ష్యం చేస్తూ రికార్డులను సరిగా నిర్వహించకపోవడాన్ని బయటపెట్టారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన సిబ్బంది నుంచి రూ.35వేలు రికవరీ, రూ.4వేల జరిమానా విధించారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సమష్టిగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్ మేనేజర్ సుధాకర్, జేక్యూసీ కృపాకర్, ఎస్సార్పీ రాజు, ఎంపీడీవోలు సుధాకర్‌రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, ఏపీవో శివలింగం, ఈసీ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్‌ఏలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment