‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరికోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రతను, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రహరీ లేని పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా పరీక్షల సమయానికి తగ్గట్లుగా ఆయా మార్గాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి..
అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను రాయబోవు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో మానసికస్థైర్యం నింపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, విద్యుత్ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు పద్మ, లింబాద్రి, ప్రవీణ్ పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కూలీలకు ఉపాధి పనులు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పశువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు మరమ్మతులు చేయించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలన్నారు. జాబ్‌కార్డు కలిగివున్న ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈజీఎస్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. అనంతరం పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిల్లోని ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్న ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయొద్దని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment