● 25శాతం రిబేట్ కల్పించిన సర్కారు ● చెల్లింపునకు ఈ నెల 31వరకు గడువు ● ముందుకురాని దరఖాస్తుదారులు ● హెల్ప్‌డెస్క్‌లకు స్పందన కరువు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అధికారులు దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినా మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోనే కాకుండా ము న్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మున్సి పాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి ఎస్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా మ్యాపింగ్ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 44,436 దరఖాస్తులు రాగా.. వీటిని మూడు దశల్లో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికి అనుమతి ఇవ్వనున్నారు.
మూడు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 44,436 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫీజు చెల్లింపునకు 24,576 దరఖాస్తులు సరైనవిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 16వరకు 239 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించగా ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.68.02 లక్షల ఆదాయం సమకూరింది. ఇంకా 24,337 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంది.
బల్దియాల వారీగా ఇలా..
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో 1,928 దరఖాస్తులు రాగా, 1,348 దరఖాస్తులను ఫీజు చెల్లింపునకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 15మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 1,333 మంది చెల్లించాల్సి ఉంది. నిర్మల్ బల్దియా పరిధిలో 15,515 దరఖాస్తులు రాగా, 10,264 దరఖాస్తులు సరైనవిగా గుర్తించారు. ఇందులో 115 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 10,161 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. భైంసా మున్సిపల్ పరిధిలో 9,044 దరఖాస్తులు రాగా, 6,289 దరఖాస్తులను సరైనవిగా గుర్తించారు. ఇందులో 48 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 6,241 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది.
వేటికి ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదంటే..
మున్సిపల్ పరిధిలో బఫర్, ఎఫ్టీఎల్, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితా లోని భూములకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వీటి పరిధిలో భూములుంటే గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నా క్రమబద్ధీకరణ చేయకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌కు పూర్తి ఫీజు చెల్లించినా క్షేత్రస్థాయి విచారణ అనంతరం తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10శాతం మినహాయించుకుని 90 శాతం డబ్బులు తిరిగి దరఖాస్తుదారుకు చెల్లిస్తారు.
మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వ చ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. బల్దియాల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. దరఖాస్తుదారులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.
క్షేత్రస్థాయి పరిశీలన ఇలా..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను అధికారులు మొదటి దశలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముందుగా సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పరిశీలిస్తారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా పరిశీలన చేపడతారు. సర్వే నంబర్ల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, నీటి పారుదలశాఖ అసిస్టెంట్ ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలిస్తోంది. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్‌లో నమోదు చేస్తోంది. ఇదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధి లోనివి కావని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ వర్తిస్తుంది. ఒకవేళ 31వ తేదీ దాటితే ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు గడువులోపు చెల్లించి రాయితీ వినియోగించుకోవాలి. – జగదీశ్వర్‌గౌడ్,
మున్సిపల్ కమిషనర్, నిర్మల్
ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి