
ఉల్లి రైతు.. కంటనీరు..
తానూరు: జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది భూమినే నమ్ముకున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ఒడిదుడుకులతో రైతులకు ఆశించిన దిగుబడి, లాభాలు రావడం లేదు. దిగుబడి బాగుంటే ధర పడిపోతోంది. ధర బాగుంటే దిగుబడి రావడం లేదు. తాజాగా ఈ యాసంగిలో జిల్లాలో ఉల్లి సాగు చేసిన రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో ఉల్లి ధర మార్కెట్‌లో కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు ఉంది. క్వింటాల్ ధర రూ.3 వేలకుపైనే పలికింది. ఈ డిమాండ్‌ను గమనించిన జిల్లా రైతులు ఉల్లి సాగుపై దృష్టి సారించారు. తానూరు మండలంలో ఈ సీజన్‌లో ఉల్లి పంట అధిక విస్తీర్ణంలో సాగైంది. అయితే, పంట కోతకు వచ్చే సమయానికి ధర పడిపోయింది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,300 మాత్రమే ధర పలుకుతోంది. దీంతో పెట్టుబడి ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంట నష్టపోయామని, యాసంగి పంటతో అప్పులు తీరుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతులకు లాభం వస్తుందని కోరుతున్నారు.
మార్కెట్ లేక..
జిల్లాలో ఉల్లి మార్కెట్ లేకపోవడంతో రైతులు దళారులపై ఆధారపడుతున్నారు. ఉల్లిని నిజామాబాద్, నాందేడ్ వంటి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. రవాణా ఖర్చులు భరించలేని వారు దళారులకు తక్కువ ధరకే అమ్ముతూ నష్టపోతున్నారు. నిర్మల్, భైంసాలో మార్కెట్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య తగ్గుతుందని రైతులు సూచిస్తున్నారు.
మార్కెట్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం స్థానికంగా ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేయాలి. భైంసా పట్టణంలో ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులకు అమ్ముకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వం ఇతర పంటలకు గిట్టు బాటు ధర కల్పించినట్టు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగొలు చేస్తే రైతులకు నష్టాలు ఉండవు. – అసం ధర్మన్న ఎల్వి, రైతు
దిగుబడి వచ్చేనాటికి పడిపోయిన ధర క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1,300.. పెట్టుబడి కూడా రావడం లేదంటున్న రైతులు మార్కెట్ లేక మరింత నష్టం..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు అంతకర్ మాదేశ్. తానూరు మండలం ఎల్వి గ్రామానికి చెందిన మాదేశ్ ఈ ఏడాది ఎకరం విస్తీర్ణంలో ఉల్లిసాగు చేశాడు. డిసెంబర్, జనవరిలో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.3 వేలకుపైనే ఉంది. దీంతో మంచి లాభాలు వస్తాయని భావించాడు. వారం క్రితం పంట చేతికి వచ్చింది. 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.1000 నుంచి రూ.1,300 మాత్రమే పలుకుతోంది. దీంతో నిజామాబాద్ మార్కెట్‌కు తీసుకువెళ్లి దళారులకు అమ్ముకున్నాడు. రూ.60 వేలు వచ్చింది. పంట సాగుకు 40 వేలకుపైగా ఖర్చు పెట్టాడు. ఆరు నెలలు కష్టపడితే మిగిలింది. రూ.20 వేలే.

ఉల్లి రైతు.. కంటనీరు..