
ప్రజాపాలన తీసుకొచ్చాం
● ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంచిర్యాలటౌన్: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ప్రజాపాలన తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబీ ఆవరణలో మాతాశిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను మార్చి 16, 2023లో పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించానని, అదే ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పిలిపించామని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏంటో తెలిసిందని, మొదటి నుంచి పార్టీకి అండగా ప్రేమ్‌సాగర్‌రావు నిలిచారని, ఆయనకు కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో మంచిర్యాలలోని మాతాశిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టవద్దని చెప్పినా వినకపోవడంతో అక్కడే నిర్మించడం వల్ల వరదల్లో మునిగి పోయిందని తెలిపారు. నాడే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంసీహెచ్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఐబీ ఆవరణలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నది వరదతో రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోతుందని, కరకట్ట నిర్మించాలని నాడు ప్రజలు కోరారని, వారి కోరిక మేరకు కరకట్టను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపి వేసిన ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సభలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.