
కారాదు విషాదం
● నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు ● తల్లిదండ్రులకు తీరని శోకం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
ఈత
సరదా..
లక్ష్మణచాంద: ఈతకు వెళ్లడం అంటే ఎవరికై నా సరదాగానే అనిపిస్తుంది. వేసవికాలం వచ్చిదంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో చిన్నాపెద్ద తేడాలేకుండా చెరువులు, వాగులు, స్విమ్మింగ్ పూల్స్‌లో సరదాగా ఈత కొడుతుంటారు. అయితే ఈత సరదా కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తోంది. పలువురి ప్రాణాలు బలిగొంటోంది. నీటిలోకి దిగి ఈతరాక అందులో మునిగి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సరదాగా ఈత కసం చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు
● ఈ నెల 18న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లికి చెందిన పూరెళ్ల అశోక్ (20)శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి స్నానా నికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు.
● ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్‌కు చెందిన ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు ఆడుకుంటూ గ్రామ సమీపంలోని చెరువువద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందారు.
● ఈ ఏడాది మార్చి 4న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన గూడెం సత్యనారాయణ (41) స్నానం చేసేందుకు గోదావరినదికి వెళ్లి ఈతరాక నీటమునిగి మృతి చెందాడు.
● ఈఏడాది మార్చి30న ఆదిలాబాద్ జిల్లా నార్నూ ర్ మండలంలోని గంగాపూర్‌కు చెందిన శంకర్ (20) కెరమెరి మండలంలోని శంకర్ లొద్దికి దైవదర్శనానికి వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులో దిగి నీటమునిగి మృతి చెందాడు.
● ఈ నెల 5న ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని చెరువులో ఈతకు వెళ్లిన పదేళ్లలోపున్న సంజీవ్, రాహుల్ ఈతరాక నీటమునిగి మృతి చెందారు.
● 2020లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్‌షిప్‌కు చెందిన వాసు (13), సతీశ్ (14) గ్రామ శివారులోని వ్యవసాయ కుంటలో ఈతకొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు.
● 2024 నవంబర్ 1న మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నేపల్లికి చెందిన కొండ అరుణ్ కుమార్ (18), దాసరి సాయి (16) సుందరశాల సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు.
● 2024 మార్చి 26న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నదిమాబాద్‌కు చెందిన వనస కమలాకర్ (22), ఆలం సాయి (22), ఉప్పుల సంతోష్ (25), ఎల్ముల ప్రవీణ్ (23) హోలీరోజు మిత్రులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి సమీపంలోని వార్ధానదికి వెళ్లారు. లోతుకు వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● చిన్నారులకు నిపుణుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి.
● ఈత రానివారు నేరుగా నీటిలో దిగకుండా సేఫ్టీ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి.
● ఈత వచ్చినవారు సైతం నీళ్లు ఎంతలోతు ఉన్నాయి? అనేది ముందుగానే గమనించిన తర్వాతే నీటిలోకి దిగాలి. లేదంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది.
● చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. కావున అందులోని పరిస్థితిని తెలుసుకోకుండా దూకితే ప్రమాదాల బారిన పడుతారు.
● చెరువులు, వాగులు, ఇతర జలాశయాల వద్ద అధికారులు తప్పనిసరిగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
● రైతులు వ్యవసాయ బావుల చుట్టూ కంచెను ఏర్పాటు చేసి అందులోకి ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టాలి.
అవగాహన లేక..
గ్రామాలలో చెరువులు, కాలువలు, కుంటలు, వాగుల్లోకి ఈతకు వెళ్లినవారు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతోనే లోతులోకి వెళ్లి నీటమునిగి ఊపిరి ఆడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. నేను ఇప్పటి వరకు గోదావరిలో మునిగిన సుమారు వందమంది ప్రాణాలు కాపాడాను.
– సాయిలు, గజ ఈతగాడు, గాంధీనగర్
సేఫ్టీ జాకెట్ ధరించాలి
ఈతకు వెళ్లే సమయంలో లైట్ సేఫ్టీ జాకెట్ ధరిస్తే ప్రమాదం సంభవించదు. ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకనే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈతకు వెళ్లినప్పుడు ఒకరిద్దరు కాకుండా గుంపుగా స్నానం చేయాలి. ప్రమాదవశాత్తు ఒకరు మునుగుతున్నా మిగిలిన వారు
కాపాడవచ్చు. – జింక లక్ష్మీనారాయణ,
గజ ఈతగాడు, నిర్మల్
ఓ కంట కనిపెట్టాలి
ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. పిల్లలు ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని వేసవి శిబిరాలకు పంపించాలి. లేదంటే ఇంటిపట్టున ఉండే పిల్లలను తల్లిందండ్రులు అనుక్షణం కనిపెడుతూ ఉండాలి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తే తరచూ వాకబు చేయాలి.
– పి.సాయన్న, పోషకుడు

కారాదు విషాదం

కారాదు విషాదం

కారాదు విషాదం