నిజామాబాద్: మండలంలోని బర్ధిపూర్ శివారులోని మహీంద్ర షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ చోరీ వివరాలు సీఐ కె.కృష్ణ తెలిపిన ప్రకారం.. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా ఆదివారం అర్ధరాత్రి ముఖాలకు మాస్కులు ధరించిన నలుగురు దొంగలు షోరూం వెనుకవైపు కిటీకి తొలగించి లోపలికి ప్రవేశించారు. షోరూంలోని అన్ని గదులు తిరిగి కౌంటర్‌లోఉన్న రూ.82వేలు, ఒక ట్యాబ్, సెల్‌ఫోన్ దొంగిలించారు.
అనంతరం నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. అయితే లాకర్ వంద కేజీల బరువు ఉండటంతో దానిని దూరంగా తీసుకెళ్లలేకపోయారు. షోరూం వెనుక ఉన్న చెత్తకుప్ప కింద దాచిపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించిన సెక్యూరీటీ సిబ్బంది షోరూం మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు తెలిపారు. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ సిబ్బందితో షోరూంను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
శనివారం రాత్రి క్యాషియర్ దినేశ్ రూ.4లక్షల 80 వేల నగదును లాకర్‌లో భద్రపరిచి వెళ్లాడని ఆ లాకర్‌తోపాటు చిన్న లాకర్‌లో దాచిన రూ.82వేలు చోరీకి గురైనట్లు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సీసీటీవీ పుటేజీలు పరిశీలించగా లాకర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు కొద్ది సేపటికి ఖాళీ చేతులతో రోడ్డుపైకి రావడాన్ని గమనించారు. దీంతో షోరూం వెనుక ఉన్న ప్రతిఅంగుళాన్ని పరిశీలించారు.
సీఐ కృష్ణ ట్రాక్టర్‌ను తెప్పించి చెత్త కుప్పను తొలగించడంతో దానికింద ఉంచిన లాకర్ బయటపడింది. అందులోని డబ్బును పోలీసుల సమక్షంలో లెక్కించగా రూ.4.80 లక్షల నగదు అలాగే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం ఏసీపీ కిరణ్‌కుమార్ షోరూంను సందర్శించి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment