ఇందూరుకు పుంగనూరు ఆవులు | Punganuru cows have many specialities | Sakshi
Sakshi News home page

ఇందూరుకు పుంగనూరు ఆవులు

Published Thu, Mar 28 2024 1:55 AM | Last Updated on Thu, Mar 28 2024 1:42 PM

గోమాతలకు పూజలు చేస్తున్న జ్ఞానేందర్‌ దంపతులు - Sakshi

గోమాతలకు పూజలు చేస్తున్న జ్ఞానేందర్‌ దంపతులు

ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో పెంచుకునేలా మినీయేచర్‌ ఆవుల అభివృద్ధి

అత్యంత పొట్టివైన మైక్రో మినీయేచర్‌ గోవుల సృష్టి

వీటి ఎత్తు 12 అంగుళాలు.. పొడవు 36 అంగుళాలు

ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవులు ఇవే

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరానికి చెందిన మంచాల జ్ఞానేందర్‌ గుప్తా బుధవారం పుంగనూరు నుంచి రెండడుగుల ఎత్తు మాత్రమే ఉండే పుంగనూరు ఆవులను తీసుకొచ్చారు. గోమాతలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కొత్త వస్త్రాలు, పూలమాలలతో గోమాతలను అలంకరించారు. బ్రాహ్మణుడితో ప్రత్యేకంగా గోపూజ వైభవంగా చేశారు. ఇంట్లో తమతో సమానంగా కలియతిరిగే విధంగా ఉండేందుకు తీసుకొచ్చిన ఈ ఆవులకు లక్ష్మి, నారాయణులుగా పేర్లు పెట్టుకున్నట్లు జ్ఞానేందర్‌, శ్రీలక్ష్మి దంపతులు తెలిపారు.

ఆవులను ఎందుకు ఆదరించాలి?

గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్‌ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్‌), బోనీ (బెంగాల్‌), మినీ మౌస్‌ (నేపాల్‌) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్‌ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.

పుంగనూరు స్పెషాలిటీ ఏంటీ?

పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్‌ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్‌ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి.  

ఈ ఆవులు ఎంతో ఫ్రెండ్లీ

పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు.  మైక్రో మినీయేచర్‌ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement