మద్యం మత్తులో దాడికి యత్నం
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుటే ఘటన
నిజామాబాద్: మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుటే హల్‌చల్ చేశాడు. ఆదివారం రాత్రి నగరంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏఆర్ కానిస్టేబుల్ ఆయూబ్ స్కూటీపై వెళ్తుండగా అటువైపుగా ఓ ఫ్యామిలీ కారులో వెళ్తోంది. ఈక్రమంలో స్కూటీని కారు స్వల్పంగా ఢీకొంది. దీంతో, తన స్కూటీని కారు ఢీకొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయూబ్ కారును ఆపి డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి నుంచి బలవంతంగా ఆర్‌సీ లాక్కున్నాడు.
కారులో ఉన్న మహిళలు కానిస్టేబుల్‌ను బతిమాలినప్పటికీ వినిపించుకోకుండా, దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి యత్నించాడు. సీపీ కార్యాలయం ఎదుటే అరగంటపాటు ఈ తతంగం కొనసాగినప్పటికీ అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు వాహనాన్ని ఆపి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
ఏఆర్ కానిస్టేబుల్ ఆయూబ్ నుంచి ఆర్‌సీ తీసుకొని కారులో ఉన్న వారికి ఇచ్చారు. అక్కడి నుంచి కానిస్టేబుల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించగా, మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు. బాధితులు ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment