రైతు సంక్షేమం కోసం పనిచేస్తా
నిజామాబాద్ రూరల్: రైతు సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయి రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్ మండలం మారుతీనగర్‌లో భారతీయ కిసాన్ సంఘ్ 46వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్‌సీఎస్‌ఎఫ్ తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ మాట్లాడుతూ.. రైతు ద్వారానే సమాజంలో పరివర్తన సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డిని సంఘ సభ్యులు, రైతులు సన్మానించారు. కార్యక్రమంలో కె నారాయణరెడ్డి, వీరస్వామి, వినయ్ కుమార్, డి వాసుదేవరావు, గడ్డం దశరథ్‌రెడ్డి, అధికారులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జాబ్ కార్డుల తొలగింపుపై కూలీల ఆగ్రహం
మోపాల్: మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంటలో 81 జాబ్‌కార్డులను, 131 మంది తొలగింపుపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ లాగిన్ నుంచి ఒకేసారి ఒకే గ్రామం నుంచి ఇంత మొత్తంలో జాబ్‌కార్డుల తొలగింపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకానున్న నేపథ్యంలో జాబ్‌కార్డులు రద్దు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కూలీలు ఇటీవల కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. గత మే, జూన్ నెలలో పని చేసిన కూలీల జాబ్‌కార్డులు తొలగించడంతో ఆందోళన చెందుతున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న తమ జాబ్‌కార్డుల తొలగింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తప్పును సరి చేసి జాబ్‌కార్డులు తిరిగి ఇప్పించాలని కూలీలు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఎంపీడీవో రాములునాయక్‌ను వివరణ కోరగా జాబ్‌కార్డుల జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు చేర్చుతామని, కూలీలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
సబ్ రిజిస్ట్రార్–2కు
14 రోజుల రిమాండ్
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.10 లంచం తీసుకుంటూ పట్టుబడిన రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు, స్వీపర్ వెంకట్రావుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని చర్లపల్లిలోని జైలుకు తరలించారు. అంతేకాకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీరామరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో పలు డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం.
పోలీస్ వాహనం బోల్తా
బోధన్‌రూరల్: మండలంలోని బండార్‌పల్లి శివారులో రూరల్ పీఎస్‌కు చెందిన పోలీస్ వాహనం టైర్ పేలి బోల్తాపడింది. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం బోధన్ మండలం బండార్‌పల్లికి వెళ్లి వస్తుండగా గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాహనం టైర్ పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలో బోల్తాపడింది. వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉండటంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment