నవోదయ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

నవోదయ పంచాయితీ

Published Fri, Mar 7 2025 9:31 AM | Last Updated on Fri, Mar 7 2025 9:31 AM

-

బోధన్‌లో ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు అంశం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య వివాదం రేపింది.

ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మధ్య రగడ ప్రారంభం కాగా, ఇరు

పార్టీల శ్రేణులు పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ వద్ద నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ఎంపీ అర్వింద్‌ 30 ఎకరాల స్థలాన్ని సూచించగా ఢిల్లీ అధికారులు సర్వే చేశారు. అయితే బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆచన్‌పల్లి వద్ద నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలపై ఎంపీ అర్వింద్‌ తీవ్ర విమర్శలు చేశారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయమై రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పంచాయితీ ఏర్పడింది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మధ్య నువ్వా నేనా అనేవిధంగా రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌ ఘాటైన విమర్శలు చేశారు. వివాదం మరింత ముదిరేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో రెండు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఒక విద్యాలయాన్ని కోరుట్లలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన నవోదయ విషయంలో ఇరుపార్టీల మధ్య సరికొత్త పోరుకు బీజం వేసింది. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఉండడంతో నవోదయ విద్యాలయాన్ని నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ వద్ద ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీ అర్వింద్‌ భావించారు. ఈ క్రమంలో కలిగోట్‌ వద్ద 1063 సర్వే నంబర్‌లో 30 ఎకరాల స్థలాన్ని ఎంపీ సూచించారు. ఢిల్లీ అధికారులు సర్వే సైతం చేశారు. అయితే మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మాత్రం ఆచన్‌పల్లి వద్ద 690 సర్వే నంబర్‌లోని స్థలంలో నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ ప్రతిపాదనలను ఢిల్లీ అధికారులు రద్దు చేశారంటూ, అసలు ఈవిధంగా ప్రతిపాదనలు చేయడమేమిటని ఎంపీ అర్వింద్‌ ఫైర్‌ అవుతున్నారు.

అడ్డుకోవడం సరికాదు : ఎంపీ అర్వింద్‌

సుదర్శన్‌రెడ్డి మతి తప్పి ప్రవర్తిస్తున్నారని, నవో దయ విద్యాలయం ఏర్పాటు కోసం బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని చూపించి ప్రతిపాదనలు చేయడమేమిటని ఎంపీ అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయని, ఈ విషయమై తాను రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించినట్లు అర్వింద్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించడంతో కోరుట్లలో ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు మంజూరైన నవోదయను తమ పార్టీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణను ఒప్పించి జాతీయ రహదారికి దగ్గరలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ వద్ద 30 ఎకరాల్లో ప్రతిపాదించామన్నారు. కానీ బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాత్రం బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన భూమిలో నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ముందుకు రాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అడ్డుపడడమేమిటని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవోదయ ఏర్పాటుకు 30 ఎకరాలు అవసరం కాగా, షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాలను సుదర్శన్‌రెడ్డి ప్రతిపాదించడం అనాలోచితమన్నారు. నవోదయ ఏర్పాటుకు షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని ప్రతిపాదించడం చూస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిచే ఆలోచన లేదా అని ఎంపీ ప్రశ్నించారు. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ జిల్లా అభివృద్ధిపై లేదని, 40 ఏళ్లలో ఆయన జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఘాటైన విమర్శలు చేశారు. ఇక రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమానాశ్రయాన్ని తీసుకురాలేకపోయినప్పటికీ, ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన నవోదయను ఏర్పాటు చేసుకోలేరా అన్నారు.

వేడెక్కిన రాజకీయం

అర్వింద్‌ వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వార్‌ నెలకొన్నట్లైంది. నవోదయ అడ్డుకుంటున్నారంటూ బీజేపీ శ్రేణులు బుధవారం నిజామాబాద్‌లో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాయి. దీంతో గురువారం ఎడపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీల మధ్య నవోదయ అంశం రాజకీయంగా వేడి మరింత రగిలించినట్లైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement