అతివలకు అండగా మధ్యవర్తిత్వ కేంద్రం
బోధన్‌టౌన్(బోధన్): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉచిత న్యాయసేవల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సామూ హిక మధ్యవర్తిత్వ కేంద్రాలు అతివలకు అండగా నిలుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా బోధన్‌లో సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని గత సంవత్సరం ఆగస్టు 28న జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు. ఆ తర్వాత నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మండల న్యాయసేవాధికార సంస్థ కొంతమంది తటస్థ వ్యక్తులను ఎంపిక చేసి వారికి కేంద్ర నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. బోధన్ మధ్యవర్తిత్వ కేంద్రంలో పద్మాసింగ్, సుజాత, రాజేందర్ సింగ్ సేవలందిస్తున్నారు. ఇక్కడి కేంద్రంలో ఇప్పటి వరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 90 శాతానికి పైగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే కావడం గమనార్హం. వరకట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య తగాదాలు, వృద్ధ మహిళల పెన్షన్ కేసులు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్థలు తదితర సమస్యలున్నాయి.
మధ్యవర్తిత్వ కేంద్రం ప్రయోజనాలివే..
తగాదా పడే వ్యక్తులు నిష్పక్షపాత, తటస్థ మధ్యవర్తి ద్వారా ఐచ్చికంగా సహకరించుకొని వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఈ కేంద్రాల్లో సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరిస్తారు. ఉచిత న్యాయ సలహాలు అందిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా సమయం, డబ్బు వృథా కాదు. సమస్య సులభతరంగా పరిష్కారమవుతుంది. దీంతో బాధిత మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ప్రయోజనం పొందుతున్నారు.
మహిళా సమస్యల పరిష్కారానికి కృషి
ఆధునిక ప్రపంచంలోనూ మహిళలపై వేధింపులు జరగడం బాధాకరం. మహిళలు పోలీస్‌స్టేషన్ల వర కు వెళ్లే పనిలేకుండా, వారి సమస్యను ఇక్కడే పరిష్కరించేలా ఈ కేంద్రం ముందుకు సాగుతోంది.
– పద్మాసింగ్, మధ్యవర్తిత్వ సెంటర్ సభ్యురాలు
అతివలకు అండగా మధ్యవర్తిత్వ కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment