రాజీమార్గంలోనే సమస్యల పరిష్కారం
ఖలీల్‌వాడి: భూతగాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ సునీత కుంచాల సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ పంచాయితీల కేసులు చాలా రోజుల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయని, దీంతో ఇరు కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుందన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇరువురికీ సమస్యలు తలెత్తవని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలతో పరిష్కారానికి ముందుకొస్తే నెల రోజుల్లోనే చెక్కు రూపంలో నగదు వస్తుందని తెలిపారు. 42 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి వివిధ అకౌంట్లలో నిలిచిన నగదును బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు.
నెల రోజుల్లో బదిలీ అవుతా..
జిల్లా జడ్జిగా మూడేళ్ల నుంచి పని చేస్తున్నానని, మరో నెల రోజుల్లో బదిలీ అవుతానని, ఈ లోక్ అదాలత్ చివరిదని జడ్జి సునీత కుంచాల అన్నారు. మూడేళ్లలో పోలీసులు, న్యాయవాదులు, వివిధ సంస్థలు, డిపార్ట్‌మెంట్‌ల సహకారం మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీసీపీ బస్వారెడ్డి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పద్మావతి, బార్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
18,252 కేసుల పరిష్కారం
జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 18,252 కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించినట్లు డీఎల్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్ శైలజ తెలిపారు. 14 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయగా, కేసుల పరిష్కారంతో రివార్డు రూపంలో రూ.5.34 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. యాక్సిడెంట్, బ్యాంక్ రుణాలు, ఇన్సూరెన్స్‌లకు చెందిన 300 కేసుల్లో రాజీ కుదర్చగా, కక్షిదారులకు రూ.73 లక్షల రివార్డు వచ్చినట్లు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన కేసుల కంటే 4,500పైగా ఎక్కువ కేసులు పరిష్కారమైనట్లు డీఎల్‌ఎస్‌ఏ వర్గాల ద్వారా తెలిసింది.
జిల్లా జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ
చైర్‌పర్సన్ సునీత కుంచాల
లోక్‌అదాలత్‌లో
18,252 కేసుల పరిష్కారం
300 బ్యాంక్ ఇన్సూరెన్స్ కేసుల్లో రూ.73 లక్షల రివార్డు
Comments
Please login to add a commentAdd a comment