వేర్వేరు చోట్ల కరెంటు షాక్‌తో ఇద్దరి మృతి
బోధన్‌టౌన్(బోధన్): బట్టలు ఆరవేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన బోధన్ పట్టణం రాకాసీపేట్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకాసీపేట్‌కు చెందిన సయ్యద్ బాబా(53) శనివారం ఇంటిపై బట్టలు ఆరవేస్తుండగా అక్కడే ఏర్పాటు చేసిన డిష్ బాక్సు నుంచి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి మృతికి కారణమైన డిష్ యజమానిపై చర్యలు చేపట్టాలని మృతుడి కొడుకు సయ్యద్ అద్నాన్ ఫిర్యాదు చేశాడని సీఐ తెలిపారు. ఈ మేరకు డిష్ యజమాని జయదేవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, సయ్యద్ బాబా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. కేబుల్ టీవీ డిష్ బాక్సు నుంచి విద్యుత్ సరఫరా అవుతోందని గతంలో చెప్పినా యజమాని పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందని పేర్కొన్నారు. కారకులపై చర్యలు తీసుకుంటామని సీఐ సముదాయించడంతో ఆందోళనకారులు శాంతించారు.
సీతారాంపల్లిలో మహిళ ..
బీబీపేట: ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జాలిగామ రాధిక (28) భర్త రాజనర్సు మూడు నెలల క్రితం టీవీఎస్ చాంప్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనాన్ని రాత్రి ఇంటి బయట ఉంచడంతో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ను దొంగిలిస్తున్నారు. దీంతో ఆయన వాహనానికి విద్యుత్ వైర్‌ను అమర్చి ఉంచాడు. వైర్‌ను తీయకుండా అలాగే ఉంచగా శనివారం మధ్యాహ్నం అనుకోకుండా రాధిక బండిని ముట్టుకుంది. వెంటనే విద్యుత్ షాక్ తగలడంతో కింద పడగా, చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి తొమ్మిది నెలల పాప ఉంది. మృతురాలి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కారకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన
వేర్వేరు చోట్ల కరెంటు షాక్‌తో ఇద్దరి మృతి
Comments
Please login to add a commentAdd a comment